Food Streets | దేశ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దమయింది. ఇందులో తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఆహార వీధులు ఏర్పాటు కానున్నాయి. ప్రజలందరూ పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకునేందుకు ఆరోగ్య భారత్ ను నిర్మించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఒక్కో ఫుడ్ స్ట్రీట్స్ కి రాష్ట్రాలకు రూ.కోటి కేటాయిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిస్తూ… పట్టణాభివృద్ధిశాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. తినుబండారాల ద్వారా వచ్చే రోగాలను తగ్గించి ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేయడం, ఆహార వ్యాపారంలో ఉన్నవారికి పరిశుభ్రత గురించి వివరించడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపింది.