స్వతంత్ర వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిర్మలా బుచ్ కన్నుమూశారు. 90సంవత్సరాల వయసు ఉన్న నిర్మలా వృధాప్య సంబంధిత అనారోగ్యంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భర్త దివంగత ఎంఎన్ బుచ్ కూడా ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు ఉన్నారని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఆమె మృతి పట్ల మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ సంఘం కార్యదర్శి వివేక్ పోర్‌వాల్ ఆమె మృతికి సంతాపం తెలిపారు. నిర్మలా బుచ్ సహకారాన్ని గుర్తు చేసుకుంటూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమె చిత్తశుద్ధి, పరిపాలనా దక్షత అద్భుతమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ తన సంతాప సందేశంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఆమె చేసిన సహకారంతో పాటు, సామాజిక కార్యకర్తగా బుచ్ పాత్ర ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.