స్వతంత్ర వెబ్ డెస్క్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌కు సమీపంలో ఉన్న పాలికాబజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పాలికాబజార్‌లోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే దుకాణం నిండా దుస్తులు ఉండడంతో అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు మాత్రం తగ్గడం లేదు. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అగ్నికీలలు పక్కనున్న షాప్‌లకు సైతం విస్తరిస్తుంది. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాలన్ని దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు.
దాని చుట్టుపక్కల మరిన్ని దుకాణాలతో పాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సికింద్రాబాద్ పరిధిలో గత కొంతకాలంగా రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఓ లాడ్జిలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.