మేడిగడ్డపై తుది నివేదిక వచ్చేసింది. నిపుణుల కమిటీ తమ నివేదికను NDSA ఛైర్మన్‌కు అందించింది. కేంద్ర జలశక్తి ఆమోదం తర్వాత సంబంధిత రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ దెబ్బతినడంపై అధ్యయనం చేసింది నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిపుణుల కమిటీ తమ తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. డిజైన్, నిర్వహణ సహా పలు లోపాలను ఇందులో కమిటీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. NDSA ఛైర్మన్ అనిల్ జైన్‌కు కమిటీ రిపోర్ట్ అందించగా.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపారు.
ఈ రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాతకేంద్ర జలశక్తి శాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి పంపనుంది. అయితే.. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
మేడిగడ్డ బ్యారేజ్‌లోని ఏడో బ్లాక్ 2023లో కుంగిపోయింది. బీటలు వారింది. సీసీ బ్లాకులు కొట్టుకుపోవడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్య నెలకొనడంతో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించింది. ఈ కమిటీ గత ఏడాది మే నెలలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సహా అనేక వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.