‘గద్దర్’ అవార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం
టాలీవుడ్ నుంచి స్పందన లేదంటూ సీఎం వ్యాఖ్యలు
‘గద్దర్’ అవార్డ్స్ స్వీకరించేందుకు మేం సిద్ధం: టాలీవుడ్
విధి విధానాలు రూపొందించి త్వరలో అందిస్తాం: ఫిల్మ్ ఛాంబర్
గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)తో చర్చించామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపాయి. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరామని పేర్కొన్నాయి. కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించాయి.
‘‘తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరుపున తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సంస్థల ప్రతినిధులకు వారి సమయం ఇచ్చి ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ.. తెలంగాణలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్నిరకాల అభివృద్ధికి కృషి జేస్తానని తెలియజేశారు. ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి ‘గద్దర్ అవార్డులు’ ప్రదానం చేస్తామని దానికి సంబందించిన విధివిధానాలు తయారు చేయాలని కోరారు. ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ‘గద్దర్’ అవార్డ్స్ గైడ్‌లైన్స్‌ను తెలంగాణ FDCకి తెలియజేశాయి. ఆవిధంగా త్వరలో ‘గద్దర్ అవార్డు’ కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలవ్ మెంట్ కార్పొరేషన్‌తో చర్చించి మార్గదర్శకాలు తయారుజేసి ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రికి ఇస్తాము. గద్దర్ గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన నటుడిగా, కళాకారుడిగా, జానపద పాటలందు, పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్‌గా ఆయనపై మాకు చాలా గౌరవం ఉందని తెలియజేస్తున్నాము.’’ అని తెలిపారు.
ఇదే విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రిగారిని కలిసి ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విషయముల గురించి వివరముగా చర్చించిన మీదట ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్‌లో వున్న అవార్డ్స్‌పై ముఖ్యమంత్రి ‘గద్దర్ అవార్డ్స్’ పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించిన కమిటీ గురించి చర్చించాము. దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీని నియమించి సదరు విధివిధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నాము.’’ అని పేర్కొన్నారు.