ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచదేశాల్లో అభిమానులు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిజానికి మన భారతదేశంలో క్రికెట్ అంటే 130 కోట్ల భారతీయులు ప్రాణం పెట్టి చూస్తారు. కానీ ఆ క్రికెట్ ఆడే దేశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. మహా అయితే 12 నుంచి 20 జట్లు మాత్రమే ఆడతాయి.
కానీ ఫుట్ బాల్ అయితే ప్రపంచకప్ టోర్నీలో ఆడాలంటే క్వాలిఫై అయ్యేందుకు 200 దేశాలు పోటీ పడ్డాయి. అంటే దాని శక్తి ఏమిటో తెలుసుకోండి. ఇప్పుడు ఫుల్ బాల్ ని చూసే ప్రపంచదేశాల అభిమానుల సంఖ్య ఎంత ఉంటుందో ఒకసారి అంచనా వేసుకోండి.
ఇన్ని దేశాల మధ్య పోటీలు పెట్టి క్వాలిఫయింగ్ కు తీసుకువెళ్లేందుకు నిర్వాహకులకు రెండేళ్ల సమయం పట్టింది. అలా 32 జట్లను ఎంపిక చేసి ప్రపంచకప్ టోర్నీ నిర్వహించారు. నెలరోజులుగా దుబాయిలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా పోటీలను నిర్వహిస్తున్నారు.
హోరాహోరీ పోటీలు, నువ్వానేనా అన్నట్టు సాగిన గోల్స్, చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లు, గొడవలు, ఘర్షణలు, ఆనందభరిత క్షణాలు, కన్నీళ్లు, విచారాలు ఇలా ఒకటి కాదు ఎన్నో భావోద్వేగాల మధ్య సాగిన ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారు.
తొలిమ్యాచ్ లోనే ఓటమితో ఖంగుతిని, అక్కడ నుంచి ప్రతి మ్యాచ్ ని చావో రేవో అన్నట్టు ఆడుతూ ఫైనల్ కి అర్జెంటీనా చేరింది. అటువైపు నుంచి ఫ్రాన్స్ ఏం చేసిందంటే, నాకౌట్ దశ వరకు బాగా ఆడి, ఆ తర్వాత చిన్న టీమ్ ట్యునీషియా చేతిలో ఓడిపోయి పీకలమీదకు తెచ్చుకుంది. మళ్లీ చచ్చీ చెడి చివరకు ఫైనల్ గడప దగ్గరకు చేరింది. అర్జెంటీనా- ఫ్రాన్స్ ఇప్పుడు ఫిఫా 2022 ప్రపంచ కప్ కోసం అమీతుమీ పోరాడనున్నాయి.
ఈసారి ఛాంపియన్ అని భావించిన బ్రెజిల్ కథ క్వార్టర్ దశలోనే ముగిసి పోయింది. నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశ లోనే బోల్తా కొట్టింది. మాజీ ఛాంపియన్లు స్పెయిన్, ఇంగ్లాండ్ నాకౌట్ దగ్గర డకౌట్ అయ్యారు. మొరాకో, క్రొయేషియా సంచలనాలు మధ్యలోనే ఆగిపోయాయి.
ఇంతటి వైకుంఠపాలి మధ్యలో పాముల్లాంటి ఇన్ని జట్లను దాటుకుని ఫ్రాన్స్-అర్జెంటీనా రెండు ఫైనల్స్ కి చేరి తుది సమరానికి సిద్ధం అవుతున్నాయి. అయితే అర్జెంటీనా , ఫ్రాన్స్ రెండు జట్లు కూడా రెండేసి సార్లు ప్రపంచకప్ ను గెలుచుకున్నాయి. ఇప్పుడు మూడోసారి ముద్దాడే అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.