ఏపీలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెన్‌ఫిట్ కార్డ్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తేవడమే దీని జారీలో ప్రధాన లక్ష్యం. కృత్రిమ మేధ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వారికి ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను విశ్లేషించి.. సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో వాటికి అనుసంధానిస్తుంది. AI తనంతట తానే కుటుంబానికి ఏది అవసరమో ఉత్తమ ఎంపిక చేస్తుంది.
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ సాధనకు ఇది కీలకంగా మారనుంది. ఆయా కుటుంబాల సభ్యులూ మొబైల్ యాప్‌లో ఈ సమాచారం అంతా చూసుకోవచ్చు. డిసెంబరు 2న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై వివిధ శాఖల అధికారులతోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు తీసుకోనున్నారు.