స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా గంగవరం పోర్టు(Gangavaram Port) వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’(Port Bandh) ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
దీంతో గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించారు. గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచె ఏర్పాటు చేశారు.