స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 41ఏ కింద సెప్టెంబర్ 30వ తేదీన లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రింగ్ రోడ్డు కేసు విచారణలో 41ఏ సెక్షన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ఏపీ హైకోర్టుకు సీఐడీ తెలిపిన సంగతి తెలిసిందే. విచారణకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని తొలుత కోర్టు దృష్టికి తీసుకొస్తామని… ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తామని కోర్టుకు తెలిపారు.
ఇదే కేసులో చంద్రబాబు, పి.నారాయణ తదితరులను కూడా సీఐడీ నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ14గా పేర్కొన్నారు. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ కు వెళ్లిన తర్వాత ఏపీకి లోకేశ్ తొలిసారి వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.