స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎపిసోడ్‌పై సస్పెన్స్ కొనసాగుతుంది. డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే తన మద్దతుదారులతో డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచింది డీకే టీమ్. అయితే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు సిద్ధరామయ్య. ఈ రాత్రికి రాహుల్‌ను కలిసి సీఎం సీటు గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, శివకుమార్ మధ్య గట్టిపోటీ నెలకొంది.
తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టిన డీకే శివకుమార్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపుకోసం ఎంతో కష్టపడ్డానన్నారు. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చానని అన్నారు. నా అధ్యక్షతన 135 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని.. ప్రస్తుతం సిద్ధరామయ్యతో నాకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. నా బర్త్‌డే వేడుకల్లో కూడా సిద్ధరామయ్య పాల్గొన్నారని తెలిపారు. అయితే సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లినా ధైర్యం కోల్పోలేదని వ్యాఖ్యానించారు. నాకున్న మద్దతుదారుల సంఖ్యను చెప్పను కానీ.. నా గురువును కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్తానన్నారు.