హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ఆఫీసుపై దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్, కాంగ్రెస్ ఆఫీసుల పునాదులు కూడా మిగలవంటూ హెచ్చరించారు. రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందా అంటూ నిలదీశారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితవు పలికారు.దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆఫీసును తగలబెడతాం- రాజాసింగ్
సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.. అంటూ ప్రశ్నించారు. తాము తలచుకుంటే కాంగ్రెస్ ఆఫీసును తగులబెడతాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బిజెపి కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. వీరిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని ఎదురు దాడి చేశారు. మరోవైపు బీజేపీ కార్యాలయంపైకి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్తకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.