స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ బ్యాటింగ్ నానాటికీ తీసికట్టు అన్నట్టుగా సాగుతోంది. ఓవైపు ఆఫ్ఘనిస్థాన్ వంటి చిన్న జట్లు సైతం టోర్నీ జరిగే కొద్దీ పుంజుకుంటుంటే… ఇంగ్లండ్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యాటింగ్ వైఫల్యాలతో ఆ జట్టు స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతోంది. ఇవాళ శ్రీలంక జట్టుతో పోరులో ఇంగ్లండ్ మరీ దారుణంగా బ్యాటింగ్ చేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. పిచ్ ఏమంత ప్రతికూలంగా లేనప్పటికీ, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. లంక బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ను కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ సాధించిన 43 పరుగులే అత్యధికం. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలాన్ 28 పరుగులు చేశారు. జో రూట్ (3), కెప్టెన్ జోస్ బట్లర్ (8), లివింగ్ స్టన్ (1), మొయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (0) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో, సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ లహిరు కుమార 3 వికెట్లతో, ఏంజెలో మాథ్యూస్ 2 వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీశారు. కసున్ రజిత 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు.