17.7 C
Hyderabad
Friday, January 10, 2025
spot_img

కూటమికి ముగింపు పలుకుదామా..?- ఒమర్‌ అబ్దుల్లా ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీ ఎన్నికల ప్రభావం ఇండియా అలయన్స్ పై పడింది. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన శీష్ మహల్ వ్యాఖ్య రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షంగా ఉంది. అయినప్పటికీ, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీపార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోలేదు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. కాంగ్రెస్ పార్టీతో కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంటోంది. కొన్ని నెలల కిందట జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అలాగే కాంగ్రెస్‌ కూడా హర్యానా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. కాగా ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

మొత్తానికి ఢిల్లీ ఎన్నికలతో కాంగ్రెస్, ఆప్ మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు పార్టీలు అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇండియా అలయన్స్ లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీ రాజకీయాలతో తనకు ఎటువంటి సంబంధ లేదన్నారు. అయితే ఢిల్లీ పరిణామాలను నిశితంగా గమనిస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. అసలు ఇండియా అలయన్స్ భవిష్యత్తులో కొనసాగుతుందా లేక ఢిల్లీ ఎన్నికల తరువాత మనుగడ కోల్పోతుందా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. ఒకవైపు ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షాలుగా ఉంటూనే మరో వైపు ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. దీంతో కేవలం 2024లోక్‌ సభ ఎన్నికల కోసమే ఇండియా అలయన్స్ ఆవిర్భవించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు ఒమర్ అబ్దుల్లా.

కొంతకాలంగా ఇండియా కూటమి బీటలు వారుతోంది. కూటమిలోని విభేదాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు నో చెప్పారు మమతా బెనర్జీ.

ఇదిలా ఉంటే ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతల నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలగాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని కొన్ని భాగస్వామ్య పక్షాలు కోరుతున్నాయి. ఇండియా కూటమి ఆవిర్భావానికి ఒక నేపథ్యం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సవాల్ చేసే ఒక రాజకీయ వేదికగా ఇండియా కూటమి ఏర్పడింది. అయితే ఇండియా అలయన్స్ లోని మిగతా భాగస్వామ్య పక్షాలను కలుపుకుని పోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే ఇండియా అలయన్స్ నాయకత్వం చేపట్టడానికి తాను సిద్దమేనంటూ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్ లో దుమారం చెలరేగింది. కాగా మమతా బెనర్జీకి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ మద్దతు పలకడం విశేషం.

కాగా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ప్రస్తుతం ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షంగా ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండూ కలిసి ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. విజయం సాధించాయి. అయితే ఇటీవల కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కూడా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో ఓటమి పాలైతే, వెంటనే ఈవీఎంలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ఇటీవల ఆనవాయితీగా మారింది. కాగా కాంగ్రెస్ ఇలా ఈవీఎంలపైకి ఓటమిని నెట్టేయడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ తప్పుపట్టింది. ఓటమికి కారణాలు తెలుసుకోవాలే కానీ, ఈవీఎంలపై నింద వేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కుండబద్దలు కొట్టారు.

వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటులో ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడానికి ఒక కూటమిగా ఏర్పడాలని అప్పట్లో ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేక శిబిరంలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చొరవ తీసుకున్నారు. పాట్నాలో విపక్షాల తొలి భేటీని ఏర్పాటు చేశారు.పాట్నా భేటీకి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యేలా చూడటంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రతిపక్షాల సమావేశాలు జరిగాయి. బెంగళూరు సమావేశాల్లో ప్రతిపక్షాలు మరో ముందడుగు వేశాయి. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అంటూ పేరు పెట్టుకున్నాయి. బెంగళూరు సమావేశానికి 26 బీజేపీయేతర పార్టీలు హాజరయ్యాయి. ఆ తరువాత ముంబయి నగరంలో రెండు రోజుల పాటు ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి.

ఇదిలాఉంటే, ఇండియా అలయన్స్ చీఫ్ పదవిని నితీశ్ కుమార్ ఆశించినట్లు హస్తిన రాజకీయవర్గాల సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఇండియా కూటమి చీఫ్‌గా ఎంపికయ్యారు. ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్సే. దీంతో సహజంగా కాంగ్రెస్ అధ్యక్షుడికి కూటమి నాయకత్వం దక్కడంపై ఎవరూ అభ్యంతరాలు తెలియచేయలేదు. అంతేకాదు నితీశ్ కుమార్‌ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం విశేషం. ఇదిలా ఉంటే, కూటమి కన్వీనర్ పదవికి నితీశ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. భాగస్వామ్య పక్షాలకు చెందిన అనేకమంది నాయకులు నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే కన్వీనర్ పదవి తీసుకోవడానికి నితీశ్ కుమార్ సున్నితంగా తిరస్కరించారు. అయితే కూటమిలో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ కావడంతో మిగతా భాగస్వామ్యపక్షాలు వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో కూటమి అధ్యక్ష పదవి దక్కకపోవడంతో, కన్వీనర్ పదవిని నితీశ్ కుమార్ తిరస్కరించినట్లు చెబుతారు. అంతిమంగా నితీశ్ కుమార్ ఇండియా అలయన్స్ కు గుడ్ బై కొట్టారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. మొత్తంమీద అనేకానేక కారణాలతో ఇండియా అలయన్స్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ పోకడలే కారణమంటున్నాయి భాగస్వామ్య పక్షాలు.

Latest Articles

తప్పు జరిగింది.. క్షమించండి- పవన్‌ కళ్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తప్పు జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్