CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పటిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘గడప గడప’ కు సంబంధించి ఇతర కార్యాక్రమాలన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిలోగా ఎన్నికలు ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ క్రమంలో పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలంతా నెలకు 20 రోజులపాటు ప్రజల్లోనే ఉంటూ.. మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కాగా, సీఎం నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, విడదల రజినితో పాటుగా మరికొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.