స్వతంత్ర వెబ్ డెస్క్: ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ, ప్రతిమా కార్పొరేట్ కార్యాలయం సహా తెలంగాణలో మొత్తం 15 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా అధికారులు బయలుదేరారు. ఈడీ బృందాలతో పాటుగా సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి. హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్, శామీర్‌పేట్ వైపు ఈడీ బృందాలు వెళ్లాయి.