స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఈడీ అధికారులు తాజాగా మూడో ఛార్జీషీట్ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జీషీట్ లో సంచలన అభియోగాలు నమోదుచేసింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై కీలక అభియోగాలు మోపింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అరుణ్ పిళ్లై లిక్కర్ స్కాంలో కవిత తరపున ప్రతినిధిగా వ్యవహరించారని తెలిపింది. కవితతో పాటు ఆయన భర్త అనిల్ పేరును ఛార్జీషీట్ లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. దాదాపు రూ.100కోట్ల ముడుపులకు సంబంధించిన ఆధారాలు దొరికాయని ఈడీ పేర్కొంది. హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావించింది. నిందితుల లావాదేవిలకు సంబంధించిన వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ ను ఛార్జీషీట్ లో జతచేసింది.


