ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. త్వరలో రాష్ట్రంలో జరిగే ఎలక్షన్స్‌పై ఫోకస్ పెట్టింది ఈసీ. పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించే క్రమంలో పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాల పై దృష్టి సారించింది.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది ఈసీ. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, విజయ వంతంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రిసైండింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో పీవో, ఏపీవోల పాత్ర కీలకంకానుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ ఈ అంశాలపై దష్టి సారించింది. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాలు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల ద్వారా జరిగాయి. అయితే, జిల్లా కలెక్టర్లు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశముంది..?, వాటిని అప్పటికప్పుడు ఎలా అధిగమించాలనే దానిపై వారికి మార్గనిర్దేశం చేశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను క్షుణ్నంగా వివరించారు. అలాగే…నిర్వర్తించాల్సిన విధుల పట్ల క్రమశిక్షణతో మెదగాలని.. ఆత్మవిశ్వా సంతో పోలింగ్ ప్రక్రియకు సిద్ధమవాలని సూచించారు. చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్ అప్రోచ్‌తో పెంపొందించుకోవాలని తెలియజేశారు. మాక్ పోల్ విషయంలో అప్ర మత్తంగా వ్యవహరించాలని,.. పోలింగ్ స్టేషన్ సెటప్, ఈవీఎం-వీవీప్యాట్, మార్క్‌డ్ కాపీ, టెండర్డ్ ఓట్, ఛాలెంజ్డ్ ఓట్, పీవో డెయిరీ, పీవో రిపోర్ట్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలని ట్రైనర్ల కు సూచించారు. పీవో, ఏపీవోలు నిర్వహించాల్సిన వివిధ ఫారాలు, రిజిస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండా లని.. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఎన్నికల విధులను విజయవంతంగా పూర్తిచేయా లని శిక్షణా కార్యక్రమంలో వివరించారు.
ఇక మే 13న ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్ర పోరులో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే… వైసీపీని గద్దె దించడమే టార్గెట్‌గా విపక్ష కూటమి పావులు కదుపుతోంది. దీంతో అటు వైసీపీ, ఇటు విపక్ష కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. ఇక విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారం పర్వం జోరందుకుంది. ఓవైపు సీఎం జగన్ బస్సు యాత్రలతో హోరెత్తిస్తుంటే.. ఉమ్మడిగా టీడీపీ, జనసేన, బీజేపీలు వైసీపీ గద్దె దించే వ్యూహంతో ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. మరోపక్క అన్న జగన్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ షర్మిల అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇలా ఎవరికి వారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరి ప్రజాక్షేత్ర రణరంగంలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు..? ఎవరిని తిరస్కరిస్తాన్నది తెలియాలంటే జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


