కేరళలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సాధారణ ర్యాగింగ్ గానే భావించి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. విచారణలో దిమ్మతిరిగి పోయే విషయాలు తెలుసుకున్నారు. ర్యాగింగ్ ఇంత క్రూరంగా కూడా చేస్తారా.. అని ఆశ్చర్యపోయారు. ముగ్గురు జూనియర్ విద్యార్థులను ఐదుగురు సీనియర్ స్టూడెంట్స్ మరీ ఘోరంగా హింసించినట్టు తేలింది.
ఒంటి మీద బట్టలు లేకుండా, ప్రైవేట్ పార్ట్స్‌కి డంబెల్స్ వేలాడదీసి, జామెట్రీ బాక్సులోని కాంపాస్‌లతో గుచ్చి, దారుణంగా కొట్టి.. ఇలా మూడు నెలల పాటు ముగ్గురు యువకులు చిత్రహింసలకు గురయ్యారు. ఈఘటన కేరళలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను షేక్ చేసింది. మూడు నెలల పాటు తమ జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో శారీరకంగా, మానసికంగా హింసించినందుకు ఐదుగురు థర్డ్ ఇయర్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన కొట్టాయంలోని నర్సింగ్ కాలేజ్‌లో చోటుచేసుకుంది. తిరువనంతపురానికి చెందిన ముగ్గురు మొదటి సంవత్సరం విద్యార్థులు కొట్టాయం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ర్యాగింగ్ పేరుతో చిత్ర హింసలు గత ఏడాది నవంబర్‌లో మొదలై.. మూడు నెలల పాటు కొనసాగింది.
విషయం బయటకు రావడంతో నిందితులను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు మొదటి సంవత్సరం విద్యార్థులను బలవంతంగా ఒంటి మీద దుస్తులు లేకుండా నిలబెట్టి, ప్రైవేటు పార్ట్స్‌కి సీనియర్స్ డంబెల్స్ వేలాడదీశారని చెప్పారు. ఇంతటితో ఆగకుండా జామెట్రీ బాక్సులోని కంపాస్ వంటి షార్ప్ వస్తువులతో బాధితుల ఒంటిపై గాయాలు చేశారని తెలిపారు.
వారి చిత్రహింసలు ఇంతటితో ఆగలేదు. నొప్పి కలగాలని గాయాలకు లోషన్ రాశారట. దీంతో నొప్పి భరించలేని బాధితులు అరవడం మొదలుపెట్టడంతో బలవంతంగా లోషన్‌ను నోట్లో పోశారట. వికృతానందం పొందిన సీనియర్స్.. ఇదంతా తమ ఫోన్లలో చిత్రీకరించి .. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించారు.
ప్రతి ఆదివారం ఆల్కహాల్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని సీనియర్స్.. బాధితులను డిమాండ్ చేసేవారట. డబ్బులు ఇవ్వకపోతే చావబాదేవారని బాధతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చిత్రహింసలను భరించలేని ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పే ధైర్యం చేశాడు. చివరకు తండ్రితో కలిసి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.
కొచ్చిలో 15 ఏళ్ల స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వారాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడు అతి దారుణంగా చిత్రహింసలకు గురయ్యాడని .. అందుకే ప్రాణం తీసుకున్నాడని ఆ విద్యార్థి తల్లి ఆరోపించింది.