ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడపలేని స్థితికి వచ్చాం. ఇక ఫోన్‌లో 24 గంటలూ సోషల్ మీడియాలో ఉండే వారే ఎక్కువ. అందులోనూ రీల్స్ పిచ్చితో సమయం వృథా చేసుకోవడంతో పాటు అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారు.
కాలేజీలో చదువు, ఆఫీసు ఒత్తిళ్లు, ఇంట్లో పనులు, చికాకులను మర్చిపోవడానికి రాత్రిళ్లు సామాజిక మాధ్యమాల్లో రీల్స్, షార్ట్స్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు యువత, ఇది మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది.
చైనాలో ఇటీవల దాదాపు 4వేల మందిపై చేసిన అధ్యయనాల్లో యువత, మధ్య వయసు వారు రాత్రి వేళల్లో రీల్స్ చూడటం వల్ల రక్తపోటు వచ్చిందని తేలింది. ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా రాత్రిళ్లు సిస్టమ్‌పై పని చేసే వారు, టీవీ చూసేవారికంటే మొబైల్‌లో రీల్స్ చూసే వారే ఎక్కువగా ఉన్నారు. రోజు రోజుకి ఇదొక వ్యసనంలా మారిపోతుంది. ఆ సమయానికి ఫోన్ అందుబాటులో లేకపోయినా, రీల్స్ చూసేందుకు వీలు లేకపోయినా చిరాకు, అసహనం వచ్చేస్తున్నాయి.
దీని ప్రభావం జీవనశైలి మీద పడుతుంది. భావోద్వేగాలు అదుపులో లేకపోవడం, వాటిల్లో వచ్చే కంటెంట్‌కి తగ్గట్లుగా జీవితం ఉండాలనే ఆశలు పెట్టుకోవడం లాంటివి చేస్తారు.సోషల్ మీడియా కంటెంట్ ప్రభావంతో కొన్ని సార్లు సంతోషంగా ఉంటే మరికొన్ని సార్లు ఒత్తిడి, ఆందోళన వంటివీ వెంటాడుతాయి. 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల వారు డిప్రెషన్‌కు గురి అయ్యేందుకు ప్రధాన కారణం రాత్రి వేళల్లో ఫోన్ చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడమే అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫోన్ బ్లూ లైట్.. స్లీప్ సైకిల్‌లో తేడాను తీసుకొస్తుంది. దీని కారణంగా మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీని వల్ల నిద్రకు ఆటంకం కలిగి శరీరం అలసటకు గురవుతుంది. రాత్రిళ్లు చక్కటి నిద్ర పట్టేందుకు మంచి పుస్తకం చదవడం, కుటుం సభ్యులతో గడపడం, సంగీతం వినడం వంటివి చేయొచ్చు.