35.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

2024 ఏడాది ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

  అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలున్నాయి. ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జా తీయ వ్యవహారాల నిపుణులు. రష్యాలో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తైవాన్ అధ్యక్ష పదవికి ఈ ఏడాది జనవరి 13న ఎన్నికలు జరిగాయి. చైనా – తైవాన్ మధ్య కొంతకాలంగా వివాదం రగులుతోంది.ఈ వివాదమే తైవాన్ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. తైవాన్‌తో చైనా గొడవలు ఇప్పటివి కావు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గొడవలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని ఓ ద్వీపం. ఎప్పుడో 73 ఏళ్ల కిందట సివిల్ వార్ సమయంలో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. టెక్నికల్‌గా స్వతంత్ర దేశమా? కాదా? అనే సంగతి పక్కన పెడితే తైవాన్ దశాబ్దాల నుంచి తన మానాన తాను బతుకుతోంది . ఏ విషయంలోనూ చైనాపై ఆధారపడలేదు తైవాన్‌. అయితే ద్వీపదేశమైన తైవాన్ అలా స్వతంత్రంగా బతకడం డ్రాగన్ చైనాకు నచ్చలేదు. మళ్లీ తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసింది. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి

అయితే తైవాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా చైనా వెనక్కి తగ్గుతోంది. ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నా మరో వైపు 1980లో రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్తంత మెరుగుపడ్డాయి. ఈ సమయంలోనే తైవాన్ ను బుజ్జగించడానికి చైనా ఒక ప్రతిపాదన చేసింది, ఒక దేశం- రెండు వ్యవస్థలు అంటూ ఓ ప్రతిపాదన చేసింది చైనా. అంతేకాదు తమ సామ్రాజ్యంలో కలిసిపోవడానికి తైవాన్ అంగీకరిస్తే, పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది. కొంతవరకు స్వతంత్రత కల్పిస్తామని డ్రాగన్ చైనా మాట ఇచ్చింది. అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది. దీనికి తైవాన్ ప్రజలు అంగీకరించలేదు. తైవాన్‌ దేశాన్ని తమ భూభాగంలో కలిపేసుకోవడానికి చైనా చేసిన ప్రయత్నాలను డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంది. ఇదే అంశంపై చైనాతో కనీసం చర్చలకు కూడా లాయ్ చింగ్ అంగీకరిం చలేదు. కరడుగట్టిన చైనా వ్యతిరేకిగా లాయ్ చింగ్‌కు తైవాన్ ప్రజల్లో ఇమేజ్ ఉంది. ఈ ఇమేజే ఆయన విజయానికి కారణమైంది.తాజాగా జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో దేశ అంతర్గత విషయాలే ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. చైనాలో విలీనం ప్రతిపాదనే కీలకాంశంగా మారింది. ఎన్నికల్లో లాయ్ చింగ్ పరాజయం పాలవ్వాలని చైనా కోరుకుంది. అయితే చైనా వ్యతిరేకతకే ప్రజలు ఓటేశారు

తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకతకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చైనా వ్యతిరేకతే అజెండాగా జనంలోకి వెళ్లిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డీపీపీకి జనం పట్టం కట్టారు. అంతిమంగా డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి తైవాన్ ప్రజలు మరోసారి అధికారం అప్పగించారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయ్ చింగ్ విజయం సాధించారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలుపొందడం అంటే చైనా ఆధిపత్యానికి తైవాన్ సవాల్ విసిరినట్లే. ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్న దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రష్యాలో గత రెండు దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఒకప్పటి సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా వ్లాదిమిర్ పుతిన్ యే ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్నారు. మార్చిలో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో కూడా వ్లాదిమిర్ పుతిన్ విజయకేతనం ఎగురవేశారు. రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇదే నెలలో ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అధికార అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్యాలెస్‌లో సుమారు 2500 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుతిన్‌ రష్యా రాజ్యాంగంపై చేయి ఉంచి, పదవీ ప్రమాణం చేశారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.ఇదో విశేషం.

ఇదిలా ఉంటే నవంబరులో అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా ఎన్నికల్లో ఏం జరగబో తుందనే విషయమై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి ఓ నేపథ్యం ఉంది. కొంతకాలంగా అంతర్జా తీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాభవం తగ్గింది. చైనా, అడుగడుగునా అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చైనా నుంచి అమెరికా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది.అయినప్పటికీ అమెరికా అంటే అగ్రరాజ్యమే. అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ హోరాహోరీ తలపడుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దాదాపుగా బరిలో ఉన్నట్లే. అయితే రహస్య పత్రాల వివాదం జో బైడెన్ మెడకు చుట్టుకుంది. బారక్ ఒబామా అధ్యక్షుడిగా, జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రహస్య పత్రాల కుంభకోణం జరిగింది. తండ్రి జో బైడెన్ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని పుత్రరత్నం హంటర్ బైడెన్ భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఆయన 81 ఏళ్ల వయసు కూడా జో బైడెన్ విజయావకా శాలకు ప్రతిబంధకం అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దాదాపుగా అభ్యర్థిత్వం దక్కినట్లే. ఈ నాలుగేళ్ల కాలంలో అమెరికాలో అత్యంత వివాదాస్పద మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అప్రదిష్ట మూట గట్టుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు కొంతకాలం కిందట సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు, తాజాగా ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరు తొలగించింది మైన్ రాష్ట్రం. ఇదొక్కటే కాదు,కిందటేడాది ఆయన అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ట్రంప్‌పై అత్యంత తీవ్రమైన రికో చట్ట ఉల్లంఘన ఆరోపణలు నమోదయ్యాయి. రికో చట్టం అంటే సాదాసీదా వ్యవహారం కాదు. క్రిమినల్ సిండికేట్ల అణచివేతకు రికో చట్టాన్ని ఉపయోగి స్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

వీటన్నిటికీ మించి శృంగార తార స్టార్మీ డేనియల్స్‌ ఎపిసోడ్ బయటకు వచ్చింది. అక్రమ సంబంధం బ‌య‌ట పెట్ట‌ కుండా ఉండేందుకు 2016 నాటి అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో స్టార్మీ డేనియ‌ల్స్ తో ఒప్పందం కుదుర్చుకు న్నార‌నేది డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. అలాగే 2021 జనవరి ఆరో తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి డొనాల్ట్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. అమెరికా చరిత్రలో ఇంతగా అప్రదిష్ట పాలైన మాజీ అధ్యక్షుడు మరొకరు కనిపించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దొరకడం అసాధ్యం అంటున్నారు అమెరికా రాజకీయ రంగ నిపుణులు.మొత్తంమీద ఈ ఏడాది ఎన్నికల నామ సంవత్సరంగా ప్రసిద్ది చెందింది.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్