తప్పని తెలిసి తప్పు చేయడం ఎంత తప్పు. తప్పు చేసిన వారిని దండించి ఆ తప్పులు సరిదిద్దాల్సిన ఉన్నతోద్యోగంలో ఉన్న వ్యక్తే చేయకూడని తప్పిదానికి పాల్పడితే ఏమంటారు? కంచే చేను మేయడం అంటారు. తప్పు చేసి తప్పించే సుకుందాం అనుకుని నిందిత వైద్యాధికారి భావించేస్తే, ఆ ఉన్నతోద్యోగి పైనున్న ఉన్నతాధికారులు ఊరుకుంటారా..? సస్పెండ్ చేసి పారేస్తారు.. కఠిన చర్యలు తీసుకుంటారు. కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చేసిన నిర్వాకానికి సరిగ్గా ఈ సస్పెన్షనే జరిగింది.
ధన్వంతరి వారసులు అనగానే ఓ గౌరవభావం ఏర్పడిపోతుంది. ఇక వైద్యశాఖలోనే ఉన్నతాధికారి, జిల్లా వైద్య శాఖ అధికారి అంటే ఎవరికైనా ఎంత వినయ, విధేయలు కలుగుతాయనేది చెప్పక్కర్లేదు. అయితే, కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చేసిన సిగ్గుమాలిన పనికి, యావత్ సమాజం ఛీత్కారాలు అంద జేసింది. ఉన్నతాధికారులు ఆయనకు సస్పెన్షన్ ఆర్డ్ ర్ అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడే కామారెడ్డికి మంచి పేరుంది. జిల్లాగా ఏర్పడ్డాక కామారెడ్డి అన్నింటా దూసుకెళుతోంది. అయితే, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య ఉన్నతాధికారి చేసిన వికార, కామ చేష్టలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో త్రికరణశుద్ధిగా సేవలు అందిస్తున్న మహిళా వైద్యులపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ హేయంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ విపరీత పరిణామాలకు భీతిల్లిన మహిళా వైద్యులు రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తమ గోడు తెలియజేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్య దర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా క్రిస్టినా జడ్ చొంగ్తూ డాక్టర్ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేశారు.జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ పై పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదైనట్టు తెలిసింది. చేసిన పాపం చెడని పదార్థం అంటారు పెద్దలు. నిక్షేపంగా పెద్ద హోదా లో ఉద్యోగం చేస్తూ ఎందరికో ఆదర్శనీయంగా ఉండాల్సిన జిల్లా వైద్యాధికారి మహిళా వైద్యులపై అను చిత రీతిగా ప్రవర్తించి సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నాడు.


