స్వతంత్ర వెబ్ డెస్క్: రోజూ మనం తాగే టీ , కాఫీ, శీతల పానియాలలో ఉండే రసాయనమే కెఫీన్. ఇదీ ఓ రకమైన మత్తుపదార్ధమే. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రమాదరహితమైన, చట్టబద్ధమైన డ్రగ్‌గా ఇది విస్తృత వినియోగంలో ఉంది. మిగిలిన డ్రగ్స్ మాదిరిగానే కెఫీన్‌కు కూడా మానసికోల్లాసాన్ని కలిగించే గుణం ఉంది. అందుకే ఒకసారి టీ లేదా కాఫీ తాగితే కాసేపటికే మనసు వాటి వైపు మళ్ళుతుంది. చెప్పుకోదగ్గ దుష్పరిణామాలు లేకపోయినా మనిషి ఆలోచనలు, జీర్ణవ్యవస్థ, నాడీకణాల మీద కెఫీన్ ఏదో స్థాయిలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడయింది.
ఒకసారి కెఫీన్ మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే శోషణ, తొలగింపు అనే ప్రక్రియ వెంటనే మొదలైపోతుంది. తీసుకున్న కెఫీన్‌లో సగభాగాన్ని తొలగించటానికి కాలేయానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. అంటే ఎంత ఎక్కువ కెఫీన్ తీసుకుంటే కాలేయానికి అంత ఎక్కువ పని పెరగుతుందన్నమాట. ఇక, నిద్ర వేళకి కనీసం 5 నుంచి 6 గంటల ముందుమాత్రమే టీ లేదా కాఫీ తాగాలి. లేదంటే నిద్ర పట్టదు. ఇందుకు భిన్నంగా నిద్రవేళ ముందు కాఫీ తాగటం అలవాటైతే కొన్నాళ్ళకు అది క్రమంగా నిద్రలేమికి దారి తీస్తుంది. అదే సమయంలో జీవక్రియల పనితీరును కూడా కెఫీన్ దెబ్బతీస్తుంది.
కెఫీన్ రక్తపోటును పెంచుతుంది. ఇది ఓ ఉత్ప్రేరకంగా పనిచేసి హృదయస్పందనను, రక్తపోటును పెంచేందుకు కారణమౌతుంది. అందుకే రోజూ టీ, కాఫీలు పరిమితికి మించి తాగేవారు హైబీపీ బారిన పడతారు. పిల్లలు,యువత మీద కెఫీన్ ప్రభావం వృద్దులకంటే తక్కువగా ఉంటుంది.