మొన్న ఐటీ అధికారులు నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లారు,. ఇవాళ నిర్మాత దిల్ రాజు ఐటీ ఆఫీసుకు వెళ్లారు. గత నెలలో ఐటీ అధికారులు దిల్ రాజు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల నోటీసులు అందుకున్నారు దిల్ రాజు. మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు , బ్యాంకు స్టేట్‌మెంట్లతో ఐటీ ఆఫీసుకు దిల్ రాజు వెళ్లాడు. సంక్రాంతికి సంబంధించిన భారీ బడ్జెట్ల సినిమాలతో పాటు , కొన్నేళ్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన లావాదేవీలపై ఐటీ టీమ్ ఫోకస్ పెట్టింది. తమ ఎకౌంట్స్ అన్నీ పారదర్శకంగానే ఉన్నాయని చెబుతున్న దిల్ రాజు.. నాడు ఐటీ అధికారులు అడిగిన వివరాలతో ఇవాళ ఆయకార్ భవన్‌కు వెళ్లారు.
సంక్రాంతి పండగ సందర్భంగా దిల్‌రాజు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేశారు. దీంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి.
నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల అనంతరం దిల్‌రాజు ఇటీవల స్పందించారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిందని అన్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమ ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని వివరించారు. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారని చెప్పారు. వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు సాధారణమన్నారు. ఈ దాడుల్లో ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది.. ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయి అంటూ కొన్ని ఛానల్స్‌లో వార్తలు హైలైట్ చేశారాయన. తమ దగ్గర అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు. ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బును ఆదాయ పన్ను అధికారులు గుర్తించలేదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.