స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన పొలిటికల్ అరంగేట్రం నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తన సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం కొత్తగూడెం వచ్చిన ఆయన మనసులోని మాట బయటపెట్టారు. సీఎం కేసీఆర్ అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఆలోచన మాత్రం లేదన్నారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్సార్ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి అవకాశాలు వెతుక్కొంటూ కొత్తగూడెం నుంచి ఎంతోమంది హైదరాబాద్, సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని.. దీంతో ‘న్యూ కొత్తగూడెం’ నిర్మాణమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


