బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో మాట్లాడిన జేసీపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), తెలుగు ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మట్లాడిన ఆమె…. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫైరయ్యారు. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా తాడిపత్రిలోని మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించానని అన్నారు. అయితే జనవరి 1న జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా తన పరువు తీశారని మండిపడ్డారు.
సంక్రాంతి కారణంగా ఆలస్యంగా జేసీపై ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. క్షమాపణ చెప్పాను అంటే సరిపోతుందా.. అని ప్రశ్నించారు. ” ప్రజలను సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులు ఇలాంటి బూతు మాటలు మాట్లాడితే ఎలా..దీనిని ఖచ్చితంగా ఖండిస్తాను. నాకోసం నేను ఫైట్ చేయాలి.. దానితో పాటు అమ్మాయిల కోసం కూడా పోరాటం చేయాలి. చాలా మంది అతను చాలా డేంజర్ అని చెప్పారు. జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్పారు. డేంజర్ అని నేను భయపడితే రేపు అమ్మయిల పరిస్థితి ఏంటి?.
జెసి ప్రభాకర్ రెడ్డి మీద రెండు ఫిర్యాదులు ఇచ్చాను. నాతో పాటు రాష్ట్రీయ యువ హిందు వాహిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్మిత గ్రాంధీ సీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన మాటల వల్ల నేను నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడ్డాము. అక్కడ జేసీ రాజ్యాంగం నడుస్తుందా?”..అని మాధవీలత నిలదీశారు
అసలు జరిగింది ఇదీ
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. అయితే ఆ వేడుకలకు వెళ్లవద్దని.. మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాధవీలత ఒక సినిమా యాక్టర్ అని.. యాక్టర్స్ అంతా ప్రాస్టిట్యూట్స్‌నే అని పరుష పదజాలంతో విమర్శించారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తాను వయసు మీద పడడంతో ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని వివరించారు. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. మాధవీలతను క్షమాపణలు కోరారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మాధవీలత జేసీని క్షమించలేదు. అప్పట్లోనే ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.