ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావం తో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.