స్వతంత్ర వెబ్ డెస్క్: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’ తుపాను మరో 24 గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కి.మీ దూరంలో, ముంబయికి పశ్చిమ-నైరుతి దిశలో 640 కి.మీలో కేంద్రీకృతమై ఉంది.
తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. తీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాత్కాలిక షెల్టర్లను రెఢీ చేశారు.
తుపాను కారణంగా జూన్ 10 నుంచి 12 వరకు 45 నుంచి 55 కిలోనాట్స్ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ఇవి 65 కిలోనాట్స్ వరకూ చేరవచ్చని అధికారులు తెలిపారు. దీంతో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.