అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక ప్రకటనతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ పరుగెత్తింది. దీంతో తాజాగా క్రిప్టో మార్కెట్ లోకి దాదాపు 300 బిలియన్ డాలర్లను చొప్పించింది. దీంతో క్రిప్టో కరెన్సీ వర్గాలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. ఐదు క్రిప్టో కరెన్సీలను వ్యూహాత్మకంగా రిజర్వులుగా ఉంచాలని తాను అనుకుంటున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు క్రిప్టో వ్యూహాత్మక రిజర్వులు ఏర్పాటు చేయాలని ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్ నకు అధ్యక్షుడు ట్రంప్ గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు. అలాగే ఈ క్రిప్టో రిజర్వుల్లో ఎక్స్ ఆర్ పీ, ఎస్ వో ఎల్, ఏడీఏ పేర్లతో ఉన్న కరెన్సీలను కూడా చేర్చాలని మార్గదర్శకాల్లో ట్రంప్ స్పష్టం చేశారు. ఇది జరిగిన గంటన్నర తరువాత బిట్ కాయిన్, ఎథర్ కరెన్సీలను కూడా చేర్చాలని ట్రంప్ పోస్టు పెట్టారు. కాగా క్రిప్టో కరెన్సీలకు సంబంధించి గతంలోనే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే గతంలో కాయిన్ల పేర్లను ప్రస్తావించలేదు. అయితే ఈసారి ఆయన ఫలానా కాయిన్లు అంటూ పేర్లు కూడా ప్రస్తావించడం విశేషం.
కాగా క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే సదరు మార్కెట్ హోరెత్తింది. అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న ఐదు క్రిప్టో కరెన్సీల విలువ మార్కెట్ లో దూసుకెళ్లింది. ఎక్స్ ఆర్ పీ, ఎస్ వో ఎల్, ఏడీవే కరెన్సీల విలువ 62 శాతం పెరిగింది. అలాగే బిట్ కాయిన్, ఎథర్ కరెన్సీల విలువ 10 శాతం పెరిగింది. వాస్తవానికి బిట్ కాయిన్ కిందటి నెలలో కొంత విలువ కోల్పోయింది. కాగా ట్రంప్ ప్రకటనతో మళ్లీ మార్కెట్ లో అత్యంత వేగంగా పుంజుకుంది.
డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి క్రిప్టో కరెన్సీలపై సానుకూల దృక్పథంతో ఉన్నారు. కిందటేడాది నవంబరులో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా క్రిప్టో కరెన్సీల అవసరాన్ని ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీల అవసరం ఉందన్న సంగతిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ తరువాత ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో , మార్కెట్ లో బిట్ కాయిన్ ధర దూసుకెళ్లింది. కాగా ఈ ఏడాది జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే, క్రిప్టో కరెన్సీలపై పనిచేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్ ను ట్రంప్ ఏర్పాటు చేశారు. కాగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన చట్టాలను, నిబంధనలను ఈ ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తుంది.
అమెరికా రిజర్వులలో క్రిప్టోకరెన్సీలను కూడా చేర్చాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం క్రిప్టో మార్కెట్ కు భారీగా ఊరట ఇస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా క్రిప్టో మార్కెట్ పడిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన, క్రిప్టో మార్కెట్ కు బిగ్ బూస్ట్ ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఈనెల ఏడో తేదీన వైట్ హౌస్ తొలి క్రిప్టో కరెన్సీ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు జరిగే వరకు క్రిప్టో మార్కెట్ ర్యాలీ చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.