స్వతంత్ర వెబ్ డెస్క్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ.
సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్‌లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి.
మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు.