స్వతంత్ర, వెబ్ డెస్క్: టీబీజేపీలో సంక్షోభం ముదురుతుంది. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా తాజా రాజకీయాలు మారాయి. ఈ క్రమంలో బండికి బాసటగా నిలుస్తూ పలువురు సీనియర్లు రంగంలోకి దిగారు. ఈటలకు వ్యతిరేకంగా పలువురు నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో మాజీ ఎంపీలు వివేక్, విజయశాంతి, రవీంద్ర నాయక్, విఠల్ తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటల తీరుపై నేతలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
పదవుల కోసం ఈటల.. ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారని సీనియర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలాన్ని ఈటల తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని సీనియర్ల తీర్మానం చేశారు. బండి సంజయ్ ప్రోత్సాహంతోనే సీనియర్లు భేటీ అయ్యారని ఈటల వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో వర్గ పోరు ఎటు దారి తీస్తుందనే ఆందోళనలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.