26.5 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

ఆచంట నియోజకవర్గం ముఖచిత్రం

      తూర్పున వశిష్ఠ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ పచ్చదనంతో అందంగా కనిపించే పైర్లు, కొబ్బరి చెట్లు.. ఇలా అందమైన ప్రకృతి మధ్య ఆచంట నియోజకవర్గం కళకళలాడుతూ ఉంటుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే నియోజకవర్గంలో సమస్యలు యథాతథంగా ఉన్నాయి. చెంతనే గోదావరి ఉన్నా మంచినీటికి ఇక్కట్లు తప్పడం లేదంటేనే నాయకులు, ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో చెప్పవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఎందుకీ పరిస్థితి ?

పాలకొల్లు నుంచి విడిపోయి… 1962లో ఆచంట నియోజకవర్గంగా ఏర్పడింది. 2004 వరకు ఇది ఎస్సీ రిజర్వుడుగానే ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, కమ్యూనిస్టులు 4 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. 1962 నుంచి 1978 వరకు ఆచంట నియోజకవర్గంలో కాంగ్రెస్-కమ్యూనిస్టుల మధ్యే పోరాటం సాగింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారిందీ నియోజకవర్గం. ఇందుకు తగినట్లుగానే 2004 వరకు ఆరుసార్లు టీడీపీ.. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. 1985 నుంచి 1994 వరకు కమ్యూనిస్టులతో తెలుగుదేశం పార్టీకి పొత్తు నడిచింది. అయితే.. 1999లో వామపక్షాలతో పొత్తు లేకుండా టీడీపీ అభ్యర్థి మోచర్ల జోహార్ వతి గెలిచారు. 2004లో పీతల సుజాత గెలుపొందారు. 2009లో నియోజకవర్గ పున ర్విభజన జరిగింది. దీంతో జనరల్ కేటగిరిలో కాంగ్రెస్ బీసీ అభ్యర్థిగా పితాని సత్యనారాయణ బరిలోకి దిగి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆచంటలో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల మంత్రిగా కూడా చేశారీయన.

     ఆచంట నియోజకవర్గం పరిధిలో.. ఆచంట,పెనుమంట్ర, పోడూరు,పెనుగొండ గ్రామాలున్నాయి. మొత్తం ఓటర్లు 1 లక్షా 66 వేల 421 అయితే, ఇందులో పురుషులు 82 వేల 547 మంది కాగా.. మహిళలు 83 వేల 866 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. ఇక, సామాజిక వర్గాల వారీగా చూస్తే.. శెట్టిబలిజలు 50 వేల మంది వరకు ఉన్నారు. ఎస్సీలు 30 వేలు, కాపులు 27 వేల మంది ఉన్నారు. దీంతో గెలుపు ఓటముల్ని శాసించేది శెట్టిబలిజలేనని చెప్పాలి. ఆచంట నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. కాకపోతే కులాల వారీగా, పార్టీల వారీగా, ఎమ్మెల్యే అభ్యర్థుల పరంగా ప్రజలు విడిపోతుంటారు. కానీ చివరికి సామాజిక వర్గం, ధన బలమే ఇక్కడ గెలుస్తూ ఉంటుందన్న వాదన బలంగా విన్పిస్తోంది. మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నాయకులు అటు వైసీపీ, ఇటు టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. అయితే.. సమస్యలను పరిష్కరించి ఉంటే మరింత బాగుండేదన్న కామెంట్లు విన్పిస్తున్నాయి.

     ఆచంట నియోజకవర్గం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. రవాణా సౌకర్యాల పరంగా ఇంకా వెనుకపడే ఉంది. రైల్వేస్టేషన్‌కి వెళ్లాలంటే 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లు వెళ్లాలి. లేదంటే 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న తణుకు వెళ్లాలి. 5వ నెంబర్ జాతీయ రహదారిపైకి వెళ్లాలంటే 8 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ఇవన్నీకాకుండా కోడేరు గ్రామం వెళ్లి అక్కడ నుంచి గోదావరి నదిని పడవపై దాటితే పి.గన్నవరం చేరుకుంటాం. అక్కడికి 20 కిలో మీటర్ల దూరంలో అమలాపురం ఉంటుంది. ఇలా ఎన్నో తిప్పలు పడితే కానీ, ఓ టౌన్‌కు లేదంటే నగరానికి వెళ్లడానికి వీలు పడదు. ఇది ఇక్కడి ప్రజలకు ఉన్న ప్రధాన ఇబ్బందుల్లో కీలకమైనది.

    కాంగ్రెస్, టీడీపీ నుంచి 2009, 2014లో పితాని సత్యనారాయణ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పని చేశారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన చెరుకువాడ శ్రీ రంగనాథరాజు రెండున్నరేళ్ల మంత్రిగా చేశారు. అంతకు ముందు 2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అక్కడా మంత్రి అయ్యారు చెరుకువాడ. వివాదరహితునిగా, ఏ మచ్చాలేని నాయకుడిగా ఈయనకు మంచి పేరుంది. అంతేకాదు ప్రభుత్వం నుంచి పనులు అయ్యేంత వరకు ఎదురుచూ డకుండా తన సొంత నిధులతో పెనుగొండ- మార్టేరు రోడ్డు వేసిన ఘనత శ్రీరంగనాథ రాజుకే దక్కుతుంది. అలాగే ఆచంటలో కూడా లంక గ్రామాల నుంచి ఇటు వైపునకు రావడానికి గోదావరిపై వంతెన కడతానని ప్రజలకు హామీ ఇచ్చారాయన. అయితే.. అది ఇంకా నెరవేర లేదు. ప్రభుత్వం ముందుకు రాకపోతే తానే వంతెన కడతానని ఇప్పటికీ చెబుతున్నారు చెరుకువాడ.

    వాస్తవానికి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు విజయం సాధించారు. తనకు 63 వేల 549 ఓట్లు వచ్చాయి. సమీప టీడీపీ అభ్యర్థి పితానికి 59 వేల 629 ఓట్లు వచ్చాయి. అంటే చెరుకువాడ 12 వేల 886 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి జవ్వాది వెంకట విజయరామ్ కి 13 వేల 993 ఓట్లు వచ్చాయి. ఒకవేళ జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే పితాని గెలిచి ఉండేవారు. ఇప్పుడు రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశానికి సీటు కేటాయించడంతో మళ్లీ పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలో వర్గపోరుతో పితానికి తలనొప్పులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీకి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ పెద్ద షాక్ ఇచ్చారు. ఇటీవలె ఆయన పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జనసేనలో ఇలా ఉంటే వైసీపీలో కూడా వర్గ పోరు మొదలైంది. గోవిందరాజు, వైట్ల కిషోర్ లను సస్పెండ్ చేయాలని చెరుకువాడ వర్గం డిమాండ్ చేస్తోంది.

    ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయి.. నాయకులు వస్తున్నారు.. పోతున్నారు. కానీ, తమ సమస్యలు మాత్రం ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు ఆచంట నియోజకవర్గ ప్రజలు. ప్రత్యేకించి లంక గ్రామాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో.. ఇంకా ఎన్నాళ్లీ దుస్థితి అని అడుగుతున్నారు ఇక్కడి ప్రజలు. ఆచంటలో ప్రధానంగా వరి పంటే ప్రజల జీవనాధారం. కాకపోతే చాలావరకు వరి పండే సారవంతమైన భూములను రొయ్యల చెరువుల్లా మార్చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీని వల్ల చుట్టు పక్కల భూములు కూడా చౌడు భూములుగా మారిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే గోదావరి ఉన్నా, కాల్వలు పూడుకుపోయి ఉన్నాయి. దీంతో చివరి భూములకు నీరందడం లేదనే విమర్శలున్నాయి. ఇక, దశాబ్దాలుగా లంక గ్రామాలకు వారధుల్లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికి ఇక్కడి ప్రజలకు పడవ ప్రయాణాలే దిక్కు. గోదావరి పోటెత్తినప్పడు పడవల్లో ప్రయాణిస్తూ అవి మునిగి ప్రాణాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు.విద్యార్థులు కూడా రోజూ స్కూళ్లు, కాలేజీలకి ఈ పడవల మీదే వెళ్లివస్తుంటారు. ఇలా వెళ్లిన వారు వారు తిరిగి ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమనే గడుపుతుంటారు.

      దొంగరావి పాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం, అగ్నిమాపక కేంద్రం, అండర్ వాటర్ డ్రైనేజి, 30 పడకల ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు.. ఇప్పటికీ అమలు కాలేదు. వశిష్ఠ గోదావరి నది వెంబడి ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నా ఎవరూ స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఇక, పారిశుధ్యం సమస్య మరీ దారుణంగా ఉంది. దోమల స్వైర విహారంతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. బ్యాంక్ కెనాల్‌పై ఆధారపడి దాదాపు 35వేల ఎకరాల ఆయకట్టు ఉంది. శివారు భూములకు నీరందక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తాత్కాలిక లిఫ్ట్ ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. ఆచంటలో 14 కోట్ల రూపాయలతో చేపట్టిన సమగ్ర రక్షిత మంచి నీటి పథకం ఏళ్లు గడుస్తున్నా ఇంకా అందుబాటులోకి రాలేదు. కోడేరు, కుందరవల్లి, కరుగోరుమిల్లి,పెదమల్లాం ప్రాంతాల్లోనైతే చెంతనే గోదావరి ఉన్నా నిత్యం గుక్కెడు నీటికోసం అవస్థలు పడుతుంటారు ఇక్కడి ప్రజలు.

      తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ దేవాలయం పెనుగొండలో ఉంది. అక్కడ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. వాసవీ ధామ్‌గా పిలిచే ఆలయంలో 92 అడుగులు వాసవీ మాత విగ్రహం ఉంది. ఆచంటలో రామేశ్వరుడు, నత్తా రామేశ్వరంలో కొలువైన నత్తా రామేశ్వరస్వామి ఆలయాలు నియోజకవర్గంలో ప్రముఖమైనవని చెప్పాలి. ఇవన్నీ పుణ్య గోదావరి నదీ తీరాన వెలసిన అతి పురాతన శైవక్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి. ఇంకా ఆచంటలో పాలరాతితో నిర్మించిన జైనుల దేవాలయం ఉంది. చుట్టూ అందంగా కన్పించే సుందరమైన గోదావరి చెంత.. కన్నీటి కథలతో ఆచంట నియోజకవర్గం నిండి ఉంటుంది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి..వారి సమస్యలను తీర్చాలంటే ఎక్కడికక్కడ వారధులు నిర్మించాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు పెద్దగా ఉపయోగ పడిందేమీ లేదంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. 2024లోనైనా తమ సమస్యలు తీర్చే నాయకులు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్