ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ పాలన నెల రోజులు పూర్తి చేసుకుంది. వైసీపీని చిత్తుగా ఓడించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా అధికార పగ్గాలు చేతపట్టి వడివడిగా అడుగులు వేస్తూ దూసుకుపోతోంది. మరి ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది..? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? జనాన్ని కూటమి నేతలు మెప్పించగలిగారా..? ఎలాంటి మార్పు చోటు చేసుకుంది..? అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
అత్యధిక సీట్లు సాధించి ఎన్డీఏ కూటమిలోనే రెండోస్థానాన్ని సాధించిన చంద్రబాబు.. ఏపీ సీఎంగా పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రంలో తిరుగులేని శక్తిగా మోదీ సహకారం, రాష్ట్రంలో పవన్‌కల్యాణ్ అండదండలతో వడివడిగా అడుగులు వేస్తూ దూసుకుపోతున్నారు. మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3వేల నుంచి రూ.4వేల రూపాలయకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, రాజముద్రతో పాస్ పుస్తకాలు, ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చలు, ఏడు ముఖ్య శాఖలపై శ్వేతపత్రాలు, తెలుగు రాష్ట్రాల సమస్యలపై దృష్టి, ఉచిత ఇసుక, బీపీసీఎల్ ఏర్పాటుపై చర్చలు, భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి, 4 వేల 976 కోట్ల వ్యయంతో 7 వేల 213 కిలో మీటర్ల మేర రోడ్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా వేగవంతమైన నిర్ణయాలతో సీఎం చంద్రబాబు పాలనలో దూసుకెళ్తున్నారు.
చంద్రబాబు అధికారం చేపడుతూనే కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. తద్వారా ఆయన తన ప్రాధాన్యాలను చెప్పకనే చెప్పారు. అలాగే రాష్టానికి తేవల్సిన పెట్టుబడులు, అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రోజు వారీ సమీక్షలు నిర్వహించారు. అభివృద్ధి దిశగా కేంద్రానికి కొన్ని నివేదికలు తీసుకుని వెళ్లారు. త్వరలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంపై చర్చలు జరిపారు. అలాగే విభజన సమస్యలపై దృష్టి సారించిన చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రితోనూ చర్చించారు. ఏపీ ప్రయోజనాల కోసం పలు డిమాండ్లను తెలంగాణ ముందు పెట్టారు.
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 16వేలకు ఉద్యోగాలతో డీఎస్సీపై చర్యలు తీసుకున్నారు. తొలి సంతకాన్ని చేసి మాట నిలుపుకున్నారు. అదేవిధంగా ఉద్యోగుల బదిలీలు, కీలక స్థానా ల్లో ఉన్నవారికి స్థాన చలనంతో పాటు.. తన వేగానికి తగిన విధంగా పనిచేసే అధికారులు ఎక్కడ ఉన్నా తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేత పత్రాలు విడుదల చేస్తూ లెక్కల చిట్టా విప్పుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పథకాన్ని తిరిగి తీసుకువచ్చారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌లు చెల్లించి అందరి నుంచి ప్రశంసలు పొందారు. జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలమందికి పెన్షన్లను పంపిణీ చేశారు. అప్పటి వరకు ఉన్న 3 వే పింఛన్‌ను 4 వేలకు పెంచుతూ.. ఏప్రిల్-జూన్ మధ్య ఉన్న బకాయిలను కూడా కలిపి 7 వేల చొప్పున అందజేశారు. ఇలా తొలి నెల రోజుల్లోనే అభివృద్ధి-సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజల మన్ననలను పొందుతున్నారు. గతానికి భిన్నంగా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పైనా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడంతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.


