భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై ఆంక్షలు
కరోనా పుట్టిల్లు చైనాలో మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. దీంతో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్ రావడం ఇదే మొదటిసారని చెప్పింది. నిన్న 29,390 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు అమలు చేస్తుండగా, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు.
చైనాలో గత కొన్నిరోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ‘జీరో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఈ నెల 20న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది. రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్ టీచింగ్ విధానానికి స్కూళ్లు మళ్లాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.