పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయం కుల, మతాల చుట్టూ తిరుగుతోంది. అంతేకాదు కంట్రీ సరిహద్దులు దాటుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ పాకిస్తాన్ వైపు తిరిగింది. తీవ్రవాదం, జిహాద్ వ్యాఖ్యలతో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ అంతకుమించి అన్న రేంజ్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. అధికారం కోసం కాంగ్రెస్ తహతహలాడుతుంటే.. ముచ్చటగా మూడవసారి కూడా విజయం సాధించి.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా సాగుతున్న ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ సమ్మర్‌ను మించి సెగలు కక్కుతోంది. ఇక ప్రచారంలో స్పీడ్ పెంచిన మతతత్వ పార్టీ బీజేపీ హిందూ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్ రగడ ముదురుతోంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఎన్నికల నేపథ్యంలో ఇండియాకు శత్రు దేశమైన పాకిస్థాన్‌ను అస్త్రంగా వాడుకుంటోంది కమలం పార్టీ. పాకిస్తాన్‌పై కాంగ్రెస్‌కు వల్లమాలిన ప్రేమ ఉందని.. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. అందుకే పాకిస్తాన్ తీవ్ర వాదులు చనిపోతే కాంగ్రెస్ నేతలు కంట కన్నీళ్లు వచ్చాయని ఆరోపించారు.
ఇక మరోపక్క ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా ప్రతిపక్షాలు సైతం మోదిని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీలక నేత మరియా ఓట్ జిహాద్‌కు పిలుపునిచ్చారు. యూపీలోని ఓ ర్యాలీలో పాల్గొన్న మరియా.. ముస్లిం ఓటర్లు ఓటు జిహాద్ ప్రారంభించాలని.. ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఇది ఒక్కటే మార్గమని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు, కానీ మానవత్వం ప్రమాదంలో ఉందని తాను చెబుతానని బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు.మరియా చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరింత రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అవుతూ గుజరాత్‌లోని ఎన్నికల ప్రచార వేదికగా కౌంటర్ ఎటాక్ చేశారు. ఇండియా కూటమి ప్లాన్‌ని మరియా బహిర్గతం చేశారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముస్లింలు ఓట్ జిహాద్‌కి వెళ్లాలని.. అందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని మరియా ఆలం కోరారని మోదీ తెలిపారు. మదర్సా నుంచి బయటకు వచ్చిన పిల్లల నుంచి కాకుండా.. ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముస్లింలంతా కలిసి ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోందని.. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మరియా చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ కానీ, ఇండియా కూటమి కానీ వ్యతిరేకించలేదని ఫైర్ అయ్యారు మోదీ. ఒకవైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విభజించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఓట్ జిహాద్ నినాదాన్ని చేస్తోందని ఆరోపించారు.
రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాకిస్థాన్ తహతహలాడుతోందని ధ్వజమెత్తారు పీఎం మోదీ. దేశంలో కాంగ్రెస్ బలహీన పడుతుంటే అక్కడ పాకిస్తానీయులు కన్నీళ్లు పెడుతున్నారని.. రాహుల్ కోసం పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ నేతలపై కూడా విరుచుకుపడ్డారు మోదీ. భారత్‌లో బలహీన సర్కారు ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇలా మొత్తానికి ఎన్నికల సమీపిస్తుండటంతో పొలిటికల్ కాక అంతకంతకు పెరుగుతోంది. ఇక ప్రచారంలో దూకుడు పెంచిన నేతలు ప్రత్యర్థిని మట్టి కరిపించేం దుకు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో వారి స్థాయి, హోదా మరిచి నోటికి పని చెబుతున్నారని ఇష్టానుసార మైన భాషతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.


