లోక్‌సభ ఎన్నికల ముందు.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేకే.. చేరికపై చర్చించారు. రేపో మాపో ఆయన సొంతగూటికి చేరడం ఖాయమైపోయింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయా పరిణామాలపై రేవంత్ చర్చిం చారు.
ప్రస్తుతం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న కడియం శ్రీహరిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. కడియం శ్రీహరి ఇంటికి ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, రోహిత్ చౌదరీ, విష్ణు దాస్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కడియం శ్రీహరి, కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకు న్నానని.. కేసీఆర్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు.