స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఎన్నికలు దగర్గపడిన వేళ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అంతం చేయడానికి బీజేపీ అభ్యర్థి కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ ఇంఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ మీడియాకు విడుదల చేశారు. ఖర్గే, ఆయన భార్య, పిల్లలను అంతం చేయండి అంటూ చిత్తాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ అన్నట్లుగా ఆడియోలో ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఖర్గేను అంతం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సూర్జేవాలా తెలిపారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చివరికి హత్యా రాజకీయాలకు సైతం బీజేపీ తెరలేపిందని ఆయన ఆరోపించారు. రాథోడ్‌కు ప్రధాని మోదీ, సీఎం బసవరాజ్ బొమ్మై అండదండలు కూడా ఉన్నాయన్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను మణికంఠ రాథోడ్ తీవ్రంగా ఖండించారు. అది ఫేక్ ఆడియో అని.. ఓటమి భయంతోనే తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.