ట్యాక్స్ పేయర్స్ కు ఇక రైతు భరోసా లేనట్లేనా? పన్ను కట్టే వారిని ఏ లెక్కన గుర్తిస్తారు? రైతు బంధును రైతు భరోసా గా మార్చిన ప్రభుత్వం పన్నుకట్టే వారికి భరోసా కట్ అన్న షరతులతో భారం తగ్గించుకుంటున్నదా? సాగు లో లేని భూములను ప్రభుత్వం ఎలా ఐడెంటిఫై చేస్తుంది?
తెలంగాణ లో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు రెండు వాయిదాలలో 10 వేలు అందిస్తుంది ప్రభుత్వం.. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీ లో భాగంగా రైతు బంధు ను రైతు భరోసా గా మార్చి ఎకరాకు 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కు కొన్ని నిబంధనలు పెట్టబోతుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ ను ఈ పథకం నుంచి తొలగిం చే అవకాశం ఉంది. దాంతో పాటు పంట సాగు చేయని భూములకు రైతు బంధు కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులుగా మారే అవకాశం కనిపిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతులు రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి 14 వేల కోట్లకు పైగా నిధులు రైతు బంధు కు ఖర్చు చేస్తోంది. రైతు బంధు ను రైతు భరోసా గా మారుస్తే మరో 7 వేల కోట్లు అదనంగా అవసరం అవుతాయి. అంటే రెండు సీజన్ లకు కలిపి 21 వేల కోట్ల రూపాయలు అవసరం.. ట్యాక్స్ పేయర్స్ ,ప్రభుత్వ ఉధ్యోగులు , సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తే 10 శాతం నిధుల భారం తగ్గే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని కౌలు రైతుల సహాయానికి మళ్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఖజానాలో నిధుల కొరత కారణంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, అప్పుల వడ్డీ ఎక్కువ భారం అవ్వడం, సంక్షేమ పథకాలు అన్నింటినీ కొనసాగించాల్సి రావడం వంటి కారణాలతో ప్రభుత్వం సతమతమవుతోంది. ఏ వర్గాన్ని విమర్శించినా ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. అందుకే వివిధ కారణాలతో రైతు బంధు భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.. అయితే రైతు భరోసా విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేస్తే తప్ప రైతు భరోసా పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. పాన్, ఆధార్ కార్డ్ ద్వారా ట్యాక్స్ పేయర్స్ గుర్తిస్తారని తెలుస్తోంది దీంతో పాటు స్పెషల్ డ్రైవ్ చేసి సాగు లేని భూముల డేటా సేకరిస్తామని. వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.ప్రభుత్వ నిర్ణయాలవల్ల రైతు భరోసా భూములు సాగుచేసే అసలైన రైతులకే అందే అవకాశం ఉంది. కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందవచ్చు.


