మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతోంది. నిన్న తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైడ్రామా అనంతరం మంచు మనోజ్ గురువారం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నిన్నటి పరిణామాలపై డీఎస్పీకి మనోజ్ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనికపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తననే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అయితే లా అండ్ ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించినట్టు సమాచారం
గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ పెద్దలకు నివాళులర్పించేందుకు బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
తాను గొడవ చేసేందుకు రాలేదని ఈ సందర్బంగా మంచు మనోజ్ అన్నారు. తాతా, నానమ్మ సమాధులకు నివాళులర్పించేందుకు వచ్చానని చెప్పారు. తన ఫ్లెక్సీలను కావాలనే చించేశారని అన్నారు. తన తండ్రి, సోదరుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమమయ్యే సమస్యలను పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హక్కులకు భంగం కలిగిస్తే ఎవరిపైనైనా కేసులు పెడతానని హెచ్చరించారు. అందరి కష్టంతోనే విద్యానికేతన్ వర్సిటీగా ఎదిగిందని.. ఇందులో తనకు భాగం ఉందని ఉద్ధాటించారు.