తెలంగాణ ఎన్నికల్లోనే అత్యంత కీలక ఘట్టమైన కౌంటింగ్ ఈనెల 3న జరగనుంది. మరి.. ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుందా లేక కొత్త పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇలాంటి వేళ పలు అంశాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, వేణుగోపాల్, నిరంజన్, రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, తదతరులు.. వికాస్ రాజ్‌ను కలిసి వినతపత్రం అందజేశారు.
ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మధు యాష్కీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ మేరకు ఈసీని కలిసి ప్రధానంగా నాలుగు అంశాలపై కంప్లైంట్ చేశారు.
రైతు బంధు నిధులను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు హస్తం పార్టీ నేతలు. ఈ మేరకు సుమారు ఆరువేల కోట్లను కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. అలాగే భూ రికార్డుల్ని కూడా మారుస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఈ సందర్భంగా తెలిపిన కాంగ్రెస్ నేతలు.. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల గురించి ప్రస్తావించారు.
ఇక, అసైన్డ్ భూముల విషయాన్నిసైతం ఈసీ దృష్టికి తీసుకెళ్లారు హస్తం నేతలు. ఈ తరహా భూముల్నిఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘాపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఉత్తమ్ సహా పలువురు నేతలు.
ఇక, అన్నింటికంటే ముఖ్యంగా ఈనెల నాలుగో తేదీన జరగబోయే కేబినెట్ మీటింగ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. మరి..ఈసీ ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది…? ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.