బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ రిప్లై ఇచ్చారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి వాటినే కోరుకుంటున్నదని తెలిపారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన సూచనలను నిశితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని స్పష్టం చేసారు.
గురుకుల టీచర్ల రిక్రూట్ మెంట్ అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే ట్వీట్ లో సీఎంకు చేసిన సలహాలకు రిప్లై ఇచ్చారు. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో.. వారి భవిష్యత్ మీద గత ప్రభుత్వం ఏవిధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూశామంటూ ఆర్ఎస్పీకి ఇచ్చిన ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి ఉదహరించారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం తెలిపారు. తమ ప్రయత్నం.. తాపత్రయం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప, గుర్తింపు కోసం కాదని తేల్చి చెప్పారు. మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే తమ ప్రభుత్వం దృష్టికి తీసుకురా వాలని కోరుకుంటున్నా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కి సీఎం రేవంత్ రిప్లై ఇచ్చారు.


