హైదరాబాద్ నగరంలో మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆరాంఘర్- జూపార్క్ పై వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 4.08 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ ను బల్దియా నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.799 కోట్లు ఖర్చైంది. ఈ ఫ్లైఓవర్‌తో బెంగుళూరు హైవే నుంచి నగరంలోకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది.
నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్ పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల సమయం వృథా అవుతోంది. మరో వైపు కోట్లాది రూపాయల ఇంధనం వృథా అవుతోంది. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ ను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే పై వంతెనలు, ఆర్‌వోబీల నిర్మాణాలు చేపట్టింది. నగరవాసుల ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేస్తోంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా సుమారు రూ.799 కోట్లతో నిర్మించిన ఈ ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలో.. రూ.301 కోట్ల సీవరేజ్ ప్రాజెక్టు పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.