సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి ఆయన హాజరుకానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణపైనా ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణపై నెల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ సమయం కుదిరితే రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న సెక్రటేరియెట్ ప్రాంగణంలో లక్ష మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.