స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన వైద్యుల పర్యవేక్షణలో సంబంధింత ఔషధాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నారని ఇటీవలే ఆయన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఫీవర్‌తో బాధపడుతున్న కేసీఆర్‌కు ఇప్పుడు… ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో సీఎం అల్పాహార పథకం ప్రారంభ సందర్భంగా.. కేటీఆర్ ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు వైరల్ ఇన్‌ఫెక్షన్ తరువాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ మొదలైందని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అయితే ఇన్‌ఫెక్షన్ వల్ల అనుకున్న సమయం కంటే ఆయన కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉందని తెలిపారు. అయినా ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారని వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రజల ముందుకు వస్తారని.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే సీఎం అల్పాహార పథకాన్ని కేసీఆర్ ప్రారంభించాల్సి ఉండగా.. ఆయన అస్వస్థతకు గురవ్వడంతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే.