Former Minister Devineni Uma | ఏపీ రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు రామోజీరావు ను టార్గెట్ చేస్తూ సీఐడీని దుర్వినియోగం చేస్తున్నారని… ఇకపై జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడవదని, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో విజయవాడ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురామును మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో ఉమా మాట్లాడుతూ.. నాలుగేళ్లు ముద్దాయిని కాపాడిన ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ఒక కన్ను మరో కన్ను అని వేదాంతం చెప్పి ప్రజలను మభ్య పెట్టాడని మండిపడ్డారు. ఇంకా ఏమైనా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే.. తమ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. వివేకానంద హత్యకేసులో ముద్దాయిల అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి.. మీ సజ్జల నోరు తెరవాలి.. మీ బూతుల మంత్రి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని…షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం లక్ష కోట్ల రూపాయల ఆస్తిని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
కృష్ణ, గుంటూరు జిల్లాలలోని డ్యాముల్లో పంటలకు నీరుందని.. వారిని రైతులకు ఇవ్వలేక, తీసుకురాలేకనే జగన్ ప్రభుత్వం నిస్సహాయక పరిస్థితులలో చేతులెత్తేసిందని అన్నారు. గోదావరి చింతలపూడి ప్రాజెక్టు గురించి సీఎం జగన్ మాట్లాడకపోవడం హాస్యాస్పదం అంటూ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాలలో సగం వాటా మావే అని తెలంగాణ వారు అంటున్నారు. అయినా సీఎం మూసుకు కూర్చున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.