స్వతంత్ర వెబ్ డెస్క్: గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని, పనితీరు బాగోలేని వారికి సీట్లు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పారు. గ్రాఫ్ బాగోలేని వారిని కొనసాగించడం కుదరదని అన్నారు. గడపగడపకూ కార్యక్రమం వల్ల గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. సర్వేల్లో అనుకూలంగా లేని వారిని కూడా కొనసాగించడం కుదరదని హెచ్చరించారు. ఇలాంటి వారికి టికెట్లు ఇవ్వడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టమని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై చర్చ సందర్భంగా ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది. అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని జగన్ అన్నారు. జగనన్న సురక్షలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజింగ్ గా తీసుకోవాలని చెప్పారు. ఏయే పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించానలి సూచించారు. వచ్చే సమావేశానికి పనితీరును మెరుగుపరుచుకుని రావాలని అన్నారు. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని.. వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. అందరూ కష్టపడి 175కి 175 సీట్లను గెలుచుకుందామని చెప్పారు.