స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు కారణాలు, ఆర్థిక లోటుతో ఇన్నాళ్లు రుణమాఫీకి కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం జాప్యం జరిగిందన్నారు. రైతులకు అందిచాల్సిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని కేసీఆర్ తెలిపారు.