ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో పర్యటించనున్నారు. 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ వెళుతున్నారు సీఎం. అయితే,.. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, అధికారుల బృందం దావోస్ వెళ్లనుంది. అక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులు దావోస్ వెళ్లారు. ఏపీ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ కూడా ఇవాళ దావోస్ వెళుతున్నారు.
ఏపీ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్‌లో ఉంటుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ బృందం ఎంపిక చేస్తుంది. WEF సదస్సు సమయంలో అక్కడ AP ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్ కౌన్సిల్ ప్రతినిధులతో అధికారుల బృందం చర్చిస్తుంది. ఇక ఈ దావోస్ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు హాజరుకానున్నారు. ఈ సారిషేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.