ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం అనేదే ప్రభుత్వ విధానమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై సచివాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మార్గం సుగమం చేసేలా పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్త పాలసీతో భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
సమగ్ర మార్పులతో 7-8 శాఖల్లో కొత్త పాలసీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చంద్రబాబు అన్నారు. కొత్త పాలసీలపై అధికారులు 3 నెలలుగా సమగ్ర కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా వివిధ డ్రాఫ్ట్ పాలసీలు రూపొందించారు. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న ముఖ్యమంత్రి… ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.