క్రీడాకారులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు కురిపించారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు ఇస్తున్న ప్రోత్సాహం 75 లక్షల నుంచి 7 కోట్లకు పెంచారు. ఆసియా క్రీడలు, జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు భారీగా పెంచాలని నిర్ణయించారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడంలో దేశంలో ఇప్పటి వరకు హర్యానా మొదటి స్థానంలో ఉంది. సీఎం చంద్రబాబు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ప్రతిపాదించారు. సచివాలయంలో నిన్న కొత్త క్రీడా విధానంపై క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
యూనిఫాం సర్వీసుల్లో 3 శాతం రిజర్వేషన్ కల్పించేలా క్రీడా విధానంలో ప్రతిపాదించారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాదించిన వారికి 50 లక్షల నుంచి 5 కోట్లకు పెంచారు. కాంస్య పతకం సాధించిన వారికి 30 లక్షల నుంచి 3 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. అలాగే ఆసియా క్రీడల్లోనూ ప్రోత్సాహకాలు భారీగా పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు చేశారు.
రాష్ట్రాన్ని క్రీడల కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో అధికారులు రూపొందించిన క్రీడా విధానంపై చంద్రబాబు చర్చించి పలు సూచనలు చేశారు. అందరికీ క్రీడలు విధానంతో రూపొందించిన ఈ విధానాన్ని సీఎం ఆమోదించారు. ఈ మేరకు మార్పులు చేసి కేబినెట్ సమావేశానికి పంపాలని అధికారులను ఆదేశించారు.