సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని.. ఈ నెల 28న సినిమా విడుదల ఉండటంతో తీరిక లేదని పేర్కొన్నారు. తనకు 8 వారాల సమయం కావాలని, ఆ తర్వాత తేదీ ఇస్తే విచారణకు వస్తానని సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావును కోరారు. అయితే.. సీఐడీ అధికారులు ఆయన వినతి మేరకు 8 వారాల సమయం ఇస్తారా.. లేదా మరోసారి నోటీసులు జారీ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కాగా.. 2019లో రామ్‌గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.